విజయానికి ఐదుమెట్లు పుస్తక సమీక్ష – కె.రమాదేవి

పుస్తకం – విజయానికి ఐదుమెట్లు

రచయిత – యండమూరివీరేంద్రనాథ్

పబ్లిషర్స్  – నవసాహితిబుక్హౌస్,విజయవాడ

పేజీలు – 453

మొదటిముద్రణ – జూన్1995

 

‘’నేను నేనుగా నిలబడేందుకు పూర్తి మానసికబలాన్ని ఇచ్చి నాకు ఆప్తమిత్రుడు అయిన పుస్తకం.. విజయానికి ఐదుమెట్లు’’

నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మాగురువుగారు నాపై వాత్సల్యంతో ఈపుస్తకం బహుమతి గా ఇచ్చి, ఏ సమస్య వచ్చిన ఈపుస్తకం చదువుమని చెప్పారు. ‘’సమస్య వస్తే నాకు చెప్పమ్మా’’ అనాలికానీ, పుస్తకం చదువుమoటున్నారు ఏంటి? అనుకున్నాను. కానీ.. ఆతరువాత అర్థమైంది.. పరిపూర్ణత్వంతో ఎదిగిన.. అనుభవజ్ఞులైన.. వ్యక్తుల సలహాలు.. సూచనల సమాహారమే ఈపుస్తకం అని. మనుషులు అన్నివేళలా తోడుండరు. కావున అద్భుతమైన ఈపుస్తకాన్ని అండగా నాకు ఇచ్చారు.

ఈపుస్తకం గురించి చెప్పాలంటే నాజీవితంలో జరిగిన ప్రతి సంఘటన ప్రస్తావించాలి. అలా అయితే మరో పుస్తకమే అవుతుంది అంతగా నాపై ప్రభావం చూపింది. ఒక్కమాటలో చెప్పాలంటే శరీరం.. ఆత్మకి గల బంధం లాంటిది ఈపుస్తకంతో నాకు గల అనుబంధం.

‘’భగవద్గీత’’లో ఏ శ్లోకం చదివిన ఎంత ఊరట చెందుతామో…ఈపుస్తకంలోని ఏ మెట్టు చదివినా అలాగే మనసు కుదుటపడుతుంది. నన్ను అంతలా ప్రభావం చేసింది ఎన్నోసార్లు జీవితంపై విసుగుచెందిన సందర్భాలలో ఈపుస్తకం చదవడం ద్వారా తిరిగి సాధారణజీవితం గడపగలిగాను. ఇది కల్పన కాదు, కధ కాదు నేను ఎదురుకున్న వాస్తవ ఘటన ఈ సమీక్షకి ఈ పుస్తకం ఎంచుకోవడానికి ముఖ్య కారణం కూడా ఇదే.

ఎంతో మంది ప్రస్తుత సమాజంలో ఆత్మన్యూనతా భావానికి గురియై వారి జీవితాలను చాలిస్తున్నారు..!! నా ఈ వ్యాసం ద్వారా ఈ పుస్తకం చదివి ఒక్కరు  అలాంటి పరిస్థితినుండి బయట పడ్డా నాజీవితం ధన్యంఅవుతుంది.

మానసిక ఆనందాన్ని ఇచ్చేపుస్తకాలు, విధ్వత్తును పెంచే పుస్తకాలు చాలానే ఉంటాయి. అవన్నీ పొందాలంటే ముందు వ్యక్తిత్వ వికాసం, మానసిక స్థైర్యంతో జీవితాన్ని , అందలి సమస్యలను ఎదురుకోగలగాలి. అలా జీవితమనే అరణ్యంలో పులిలా సంచరించ గలిగేలా, అన్ని సమస్యలను ఎదురుకోవడానికి ఈపుస్తకం 100% ఉపయోగపడుతుందని నా నమ్మకం. కాదు నా పట్ల నిజం.

ఒక మనిషి ‘’పాఠశాల స్థాయినుండి పాడె ఎక్కే రోజు’’ వరకు తన జీవితంలో జరిగే అన్ని సంఘటనలు,భావావేశాలు,సమస్యలు,సంతోషాలు,బంధాలు-అనుబంధాలు,తప్పులు-ఒప్పులు,మంచి-చెదులు, అన్నింటినీ చర్చిస్తూ… మన కుటుంబంలోని వ్యక్తి మనకు ఉపోద్ఘాతం చేస్తూ… వేలు పట్టి నడిపిస్తునట్లుగా, వాస్తవానికి దగ్గరగా మనల్ని తీసుకెళ్ళి… జీవిత పరమార్థాన్ని తెలిపి… మనం విజయం వైపు పయనించేందుకు దారిచూపే పుస్తకం ఇది.

ఈపుస్తకంలోని ఐదుమెట్లు మన జీవితకాలంలోని ప్రతి అంశాన్ని స్పృశించి రాయడం జరిగినది. ‘’జీవితం ఒక యుద్ధం’’… అని ప్రారంభించి ఆ యుద్ధంలో మన శత్రువులను, మన బలహీనతలను తెలిపి, అందుకు గాను మనకు కావలసిన ఆయుధాలను, మెలకువలను సూచించి మన గమ్యానికి దారి చూపి… మనలను గెలుపు వైపు మళ్లించి, లక్ష్యాన్ని చూపించి అది చేరేందుకు… ‘’శ్రీ కృష్ణుడు అర్జునునికి గీత బోధించిన’’ విదముగ మనను మన లక్ష్యం వైపు పయనింప చేసి, ‘’సంపూర్ణ విజయం’’ పొంది సంతృప్తితో జీవించేలా చేసే ఒక గొప్ప ఔషధం, ఆయుధం, నేస్తం… ఈపుస్తకం.

పుస్తకం మనిషిపై ఇంత ప్రభావం చూపిస్తుందా? అని చాలామంది అనుకుంటారు కానీ కచ్చితంగా చూపిస్తుంది అనడానికి  ఎందరో మహానుభావుల జీవితాలు తార్కాణాలుగా నిలిచాయి. కావున ప్రస్తుత సమాజంలో మంచి పుస్తకాలను పిల్లలకు పరిచయం చేయడం చాలా అవసరం. పెరుగుతున్న దుస్సంఘటనలు, అగమ్య గోచరమైన జీవితాలు, పరిణతి చెందని ఆలోచనలు, తప్పుదోవ  పడుతున్న యువత, యాంత్రిక జీవనం గడుపుతున్న పెద్దలు, అనుబంధాలకు నోచుకోని పిల్లలు, మితిమీరిన అవినీతి… ఇలా చెప్పుకుంటూ పోతే… సమాజం ఏమవుతుంది? మనిషి మనుగడ ఎటు పోతుంది? విజ్ఞానం ఏమి నేర్పుతుంది? అని ఎన్నిప్రశ్నలు… ప్రశ్నలుగానే మిగులకూడదంటే… యువతకి కచ్చితంగా కొన్ని మంచి పుస్తకాలు చదివే అలవాటు చేయడం అవసరం.

సాంకేతిక పరంగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన మనసమాజం… నైతిక పరంగా ఎదుగలేక పోవడానికి ముఖ్య కారణాలలో పుస్తకపఠనం తగ్గడం కూడా ఒక కారణమే. అందుకే నా వంతుగా నన్ను మార్చిన ఈపుస్తకం గురించి మీకు చెప్పదలుచుకున్నాను.

నాదేశంలోని ప్రతిఒక్కరు మానసికంగా దృఢంగా ఎదగాలని కోరుకునే నేను విపత్కర పరిస్థితులలో స్నేహితుడిగా ఈపుస్తకం తోడుంటుందని అనుభవపూర్వకంగా చెప్తున్నాను. వివేకానందులవారి సూక్తులు, చందమామ కధలు, కృష్ణాఅర్జునుల స్నేహబంధం ఇష్టపడే వారందరు ఈపుస్తకాన్ని ఆస్వాదించగలుగుతారు అనడంలో సందేహం లేదు ఇలా చెప్పడం వెనుక నా ఉద్దేశం ఏమిటంటే… ఇందులో రచయిత మాటలు వివేకనందుని సూక్తులవలె మంచివైపు నడిపిస్తాయి… ఆత్మాభిమానం పెంచుతాయి, వారి ఉదాహరణలు చందమామ కథలంత హాయిగా ఉంటాయి. వారి సూచనలు సలహాలు అర్జుముడికి శ్రీ కృష్ణుడిలా మంచి స్నేహితుడిని పరిచయం చేస్తాయి.

‘’మనసు గదిలోంచి సమస్యను పారద్రోలటమే ఈపుస్తకపు ఆశయం’’ అని రచయిత పేరుకొన్నారు. నిజంగా వారి ఆశయం నెరవేరిందనడంలో సందేహం లేదు. ‘’సమస్య మనతోపాటే ఉంటుంది. అది హృదయపుగది లోనే ఉంటుంది. ఆ గదికి తాళం వేసి ఉంటుంది. దాన్ని పారద్రోలటానికి తాళంచెవి దొరకదు అలాంటి తాళంచెవి ఎలా సంపాదించాలన్నదే ఈపుస్తక ముఖ్యోదేశ్యం’’ అని వారి ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు.

కేవలం సమస్యలను పారద్రోలటమే కాదు జీవితంలోని ప్రతి అంశాన్ని రచయిత స్పృశించారు. ‘’పసి పిల్లల పెంపకంనుండి జీవిత చెరమాంకం’’ వరకు బాధ్యతలు, విధులు మాత్రమే కాక మనసుకు హాయినిచ్చే అనేక అంశాలు పరిచయం చేశారు.

పసితనంలోని నిష్కల్మశాన్ని, యవ్వనంలోని దుడుకుతనాన్ని, నడివయసులోని బాధ్యతలను, వృద్దాప్యంలోని ఒంటరితనాన్ని చర్చించి… మనిషి పరిపూర్ణత్వమును రంగరించి రాసిన అక్షరాలు ఈపుస్తకం.

ఇందలి ఉపసంహారంలోని ఒక మాట, ‘’ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడుకున్నాక బై చెప్పుకొని ఫోన్ పెట్టేయడానికి-అవుతాలివారు ఇంకేమైనా చెప్తారేమోనని వేచి ఉండడానికి  గల తేడాయే సాధారణ జీవితానికి-రసరమ్యానుభూతికి తేడా చెపుతుంది.అవతలి వారిలో మనపట్ల ప్రేమని రెట్టింపుచేస్తుంది. విజయం అక్కడినుండి ప్రారంభమై విశ్వవ్యాప్తం అవుతుంది’’. ఇటువంటి ఉదాహరణలతో ఆకర్షణీయమైంది ఈపుస్తకం.

ధన్యవాదములు

 

 

 

 

 

 

 

Related Posts