మనిషి అలికిడిలేక ” కవితా సంపుటి పై సమీక్ష – N.నరేశ్ చారి

ప్రముఖ కవి చిత్తలూరి సత్యనారాయణ గారి
“మనిషి అలికిడిలేక ” కవితా సంపుటిపై నేనువ్రాసిన సమీక్ష.
Released on:06-03-2021మనిషి అలికిడి కోసం….
**********************
ప్రముఖ ఉర్దూ కవి మీర్ తఖీమీర్ తన కవిత్వం గురించి ఇలా అంటాడు

“గో మీరే  షేర్ హై ఖవాస్ పసంద్
పర్ మేరి గుఫ్తగూ అవామ్ సే హై”
దీనర్థం
నా కవిత్వాన్ని ప్రత్యేకమైన వ్యక్తులు ఇష్టపడతారు
కానీ నేను రాసేది సామాన్యుల భాషలోనే .ఈ వాక్యాలు చిత్తలూరి గారికి సరిగ్గా సరిపోతాయి.
చిత్తలూరి గారి కవిత్వాన్ని ప్రత్యేక మైన వ్యక్తులు ఇష్టపడతారు కానీ అతను సామాన్యుల భాషలోనే కవిత్వాన్ని వ్రాస్తాడు.
అసాధారణ ప్రతిభా వ్యుత్పత్తులు పుష్కలంగా ఉన్న కవి చిత్తలూరి గారు. అవి పుట్టుకతో వచ్చినవి కావు కఠోర సాధన చేస్తే వచ్చినవి. సామాజిక బాధ్యత, ప్రశ్నించే తత్వం, ఆర్ద్రత, ఆవేదన, చలించే స్వభావం నిండుగా ఉన్న నిఖార్సైన కవి చిత్తలూరి.
ఆల్చిప్ప లో పడ్డ  చినుకు ఆణిముత్యం అయినట్లే తన కలంనుండి జాలువారేప్రతి ఇంకుచుక్క  కవిత్వమౌతుంది.
నాకు చిత్తలూరి గారితో ముఖ పరిచయం “మనిషి అలికిడి లేక….”కవితా సంపుటి ఆవిష్కరణ సభలోనే కలిగింది కానీ అతని యొక్క కవిత్వంతో పరిచయం మాత్రం కొన్ని సంవత్సరాలనుంచి ఉంది. తన కవిత్వం చదువుతున్నంతసేపు సమీక్ష చేయాలనిపించేది కానీ తన కవితా సంపుటాలు నా దగ్గర లేవు. ఇదిగో…….ఇప్పుడు తన కవితా సంపుటి”మనిషి అలికిడిలేక”నా చేతికి రావడంతో తన కవిత్వాన్ని సమీక్ష చేసే అవకాశం  కలిగింది.
ఇక “మనిషి అలికిడిలేక…..”కవితా సంపుటి సమీక్షలోకి వెళితే….. ఇందులో మొత్తం 66 కవితలున్నాయి అందులో చివరివి రెండు అనువాద కవితలు. ఇందులో ఏ కవిత చదివినా చదివిన ప్రతి కవితకూ సమీక్ష వ్రాయాలనిపిస్తుంది.
అంతగా కవనాన్ని దట్టించాడు, ఎవరినైనా  విశేషంగా ఆకర్షించే అద్భుత శిల్ప విన్యాసంతో చెలరేగి పోయాడు. మనిషిని,సమాజాన్ని,ఆడ పిల్లలపై జరుగుతున్న అన్యాయాలను,శ్రమజీవుల వెతలను, సామాజిక రుగ్మతలను……. ఇలా ఎన్నో అంశాలను కవితా వస్తువులుగా ఎంచుకొని సామాజిక శాస్త్రవేత్తగా మారి కవిత్వాన్ని వ్రాశాడు.
చీకట్లో కొన్ని మిణుగురులను
నేల మీద కొన్ని నక్షత్రాలను
పోటెత్తే సముద్రాలను మేరు పర్వతాలను
కురిసే వాన మబ్బులను
యుద్ధాన్ని గెలిచే యోధానుయోధులను
ఓ మూల కూర్చుని నిశ్శబ్దంగా తయారుచేస్తారు” (వాళ్లెప్పటికీ !)
అంటూ గురువుల గొప్పదనాన్ని తెలుపుతూనే అలా నిజాయితీగా పనిచేసే గురువులకు సరైన గుర్తింపు లేదని “ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో ఉండరు వాళ్లెప్పటికీ”అంటూ వాపోతాడు కవి .
వాళ్లు అందించిన ఫలాలతోనే
ఈ దేశం ఆకలి తీర్చుకుంటుంది
వాళ్ళు  పోతపోసిన ఉక్కుపాదాలతోనే
ఈ దేశం నడక నేర్చుకుంటుంది”(వాళ్లెప్పటికీ !)
అంటూ ఈ దేశ అభివృద్ధి సౌధానికి గురువుల ప్రాముఖ్యత ఎంతో చెబుతాడు.
వర్తమాన అంశాలను అత్యంత వేగంగా కవిత్వంగా మార్చడం ఈ కవికి పెన్నుతో పెట్టిన విద్య.తన కవితలు చదువుతుంటే మన కళ్ళముందు ఒక డాక్యుమెంటరీ చూసిన అనుభూతి కలుగుతుంది. ఉదాహరణకు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన “దిశ” ఘటన గురించి వ్రాసిన ఈ వాక్యాలు చూడండి
నలుగురున్నచోట
నాగు పాములు ఉంటాయనో
తోడేళ్ళ కోరలు ఉంటాయనో
తన మాంసాన్ని తొలిచే
పురుగుల్లా చర్మం మీద పాకుతాయనో ఊహించుకొని
భద్రత లేని సమాజాన్ని టోల్ గేట్ దగ్గర వదిలేసి
చీకట్లో  వెన్నెలచారలా నిలబడింది……
……………………
చక్రంలో గాలి నింపి ఇస్తామన్నా చేతులు
దేహంలోంచి ప్రాణవాయువును లాగేస్తాయని
తమ్ముళ్లుగా కనిపించే రూపాలు
దేహాన్ని కొరుక్కు తినే పురుగులుగా మారతాయని
తను ఊహించి ఉండదు”(తనేంచేసింది) ఈ కవిత చివరి వరకూ చదివితే కంటనీరు రాక మానదు.
ఒక జాతికి గుర్తింపుని తెచ్చేవాటిలో అతి ముఖ్యమైనది భాష,తెలుగు భాషను  అమ్మలా భావించి తెలుగు భాష గొప్పతనాన్ని ఈ విధంగా
“మా అమ్మకు  అనేక యాసల నేపథ్యజీవనమూ ఉంది
సకల జీవన సంస్కృతుల అభినివేశమూ ఉంది “(మా అమ్మ)
అని  చెబుతూనే భాష అభివృద్ధి గురించి ప్రభుత్వం పెద్దగా చర్యలేమీ చేపట్టడం లేదని కవి దిగులు చెందుతాడు.
చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న మా అమ్మకు
నా పల్లె సోదర సోదరీమణులు నిజమైన వారసులు”(మా అమ్మ)
అని భాష బతకడంలో పల్లె ప్రజలు కీలకమని నొక్కి చెబుతాడు.
ఈ కవిలో మనకు విభిన్న కోణాలు దర్శనమిస్తాయి. ఎంచుకున్న ప్రతి వస్తువులో పరకాయ ప్రవేశం చేయడం ఈ కవికి జన్మతః వచ్చిందేమోననిపిస్తుంది. స్త్రీల గురించి కవిత్వం చెబుతున్నప్పుడు స్త్రీవాద కవేమో! అనిపిస్తుంది, ప్రకృతి గురించి కవిత్వం చెబుతున్నప్పుడు భావ కవేమో! అనిపిస్తుంది, శ్రమ జీవుల గురించి కవిత్వం చెబుతున్నప్పుడు అభ్యుదయ కవేమో!అనిపిస్తుంది, అన్యాయంపై ప్రశ్నల వర్షం కురిపించినప్పుడు  విప్లవ కవేమో! అనిపిస్తుంది, మనిషి తత్వంపై , అంతర్జాతీయ విషయాలపై కవిత్వం చెబుతున్నప్పుడు విశ్వకవేమో! అనిపిస్తుంది. ఇలా ఏ అంశంపై కవిత్వం చెప్పినా అందులో ఆర్ద్రత ఉంటుంది ,అద్భుతమైన శిల్పం దాగి ఉంటుంది
ఉదాహరణకు స్త్రీల ఆవేదన పై రాసిన కొన్ని ఈ కవితా వాక్యాలు చూడండి
“మీ ఆనందాల కాగితప్పడవలకు
పిల్ల కాలువలమై ఒదగడమే తప్ప
మా అస్తిత్వాన్ని నదిలా ఎదగనిచ్చిందెప్పుడని
మగ మహారాజులై
మీరు హుకుం జారీ చేసినప్పుడల్లా
చిత్తం ప్రభూ అంటూ
కోరుకున్న వంట మీ హస్తగతం చేసే
వంట సామ్రాజ్య రాణులం
………………………..
జీవితంలో ఒక్క రోజైనా
మా శ్రమల జైలు నుంచి
మాకు విముక్తి లభించిందెపుడని?”(శ్రమలజైలు)
ఈ కవిత రాసేటప్పుడు కవి ఎంతగా పరకాయ ప్రవేశం చేశాడో అర్థమవుతుంది.
కుటుంబాన్ని ముందుకు నడపడంలో నాన్న పాత్ర ఎంతో కీలకమని నొక్కి చెప్పే కవిత “డాడీ మంచోడు కాడు!”  ఇది చదివినవారెవరికైనా  వాళ్ల నాన్నను గుర్తుకు తెచ్చుకుంటారు. పేరు నెగెటివ్ గా ఉన్నా భావం పాజిటివ్ గా ఉంటుంది.
ఇందులో లో నాన్నను
సూర్యుని లాంటి వాడని
కొవ్వొత్తిలా కరిగిపోయే వాడని
అలుపెరుగని యోధుడని
నిత్య ప్రయాణికుడని చెబుతూనే……
అందరికీ అన్నీ పంచిపెడుతూ
తనకంటూ ఏమి మిగుల్చు కోకుండా
ఒంటరిగా మిగిలి పోతున్న డాడీ
మంచోడు ఎలా అవుతాడు?”
అని ప్రశ్నిస్తూనే అందరినీ ఆలోచింపజేస్తాడు. డాడీని ప్రేమించేలా చేస్తాడు.
ఇందులోనే
“నాకు దేవుడు కనిపించాడు “అనే కవిత  పై కవిత కు వ్యతిరేకంగా ఉంటుంది ఇందులో పేరు పాజిటివ్ గా ఉంటుంది భావం నెగెటివ్ గా ఉంటుంది.దాన్ని ఒకసారి పరికించండి
“ఆకలిమంటల్ని కన్నీళ్లతో
చల్లార్చుకుంటున్నప్పుడు
కలతల తుఫాను విరుచుకుపడి
ఉన్న కాసిని కన్నీటి కుండల్నికూడా
బద్దలు చేసినప్పుడు
నాకు దేవుడు కనిపించాడు
………………………
సమస్యలు సాలెగూళ్ళయి
చుట్టుముట్టి నప్పుడల్లా
నాకు దేవుడు కనిపించటమేగానీ
నేను మాత్రం ఎప్పుడూ
దేవుడికి కనిపించినట్టు లేదు”
అని మనల్ని ఆలోచనలో పడేస్తాడు.
ఈ కవి నిరంతర సామాజిక చింతనాశీలి. చిన్నతనం నుండి కష్టాన్ని అనుభవించిన వాడు కనుక శ్రామికుల కష్టాన్ని ఇంకా సులభంగా అంచనా వేయగలడు,అలాగే వాళ్లకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించగలడు.
శ్రామికులు లేనిది ఈ వ్యవస్థ ముందుకు కదలదు. కానీ దురదృష్టం ఏమిటంటే వాళ్ల శ్రమ పునాదుల పైన భవనాలు నిర్మించుకున్న వాళ్లు వాళ్లకి తగిన గౌరవం ఇవ్వడం లేదంటూ కవి ఆవేదన చెందుతాడు.
మీరు  నలుగురిలో
తలెత్తుకుని నిలబడటానికి
గద్దెలా పడి ఉండడమే కానీ
మీరు  ఆ నలుగురిలో
మమ్మల్ని గర్వంగా
మీ కీర్తి కిరీటానికి
సూత్రధారులం మేమేనని
పరిచయం చేసిందెప్పుడని”(తెలుసు లెండి!)
అంటూ శ్రామికుల అందరి తరఫున ప్రశ్నలు సంధిస్తాడు.
నేటి సమాజంలో నీకు జరగాల్సిన న్యాయం ఊరికే కూర్చుంటే రాదని పోరాడి సాధించాలని అవసరమైతే తిరగబడాలని
“చరిత్రలో బానిసతనమెప్పుడూ
బతిమాలితే పోలేదు
బందూకై తిరగబడితేనే పరుగు”(వీరులుగానే మరణిద్దాం)
అని ఉద్బోధచేస్తాడు.
అంతేకాదు ఎక్కడ అన్యాయం జరిగినా నీదైన శైలిలో స్పందించమంటాడు లేకపోతే నీకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరూ స్పందించరంటాడు. మాట్లాడ వలసిన చోట తప్పకుండా మాట్లాడమని
“మాట్లాడవలసినచోట
మౌనంగా పడివుండడం
పిచ్చితనమని”(మాట్లాడతావ్)
చెబుతూనే త్వరలోనే అన్యాయాన్ని నిలదీస్తున్న తనతో అందరూ గొంతు కలుపుతారని ధీమా వ్యక్తం చేస్తాడు.
దేశం ఇంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆడవాళ్ళ పైన అన్యాయాలు ఆగడం లేదు. అడుగడుగునా నిఘా నేత్రాలు ఉన్నప్పటికీ దేశంలో నిరంతరం ఎక్కడో ఒకచోట వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆడవాళ్ళ పై దాడులు జరుగుతున్నప్పుడు అందరూ వారిపై సానుభూతి వ్యక్తం చేయడం సహజం, కానీ సానుభూతితో   పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. వాళ్లకి ధైర్యం చెప్పే వాళ్ళు కావాలి, తిరగబడమని చెప్పే వాళ్ళు కావాలి అప్పుడే కొంత మార్పు వస్తుంది. ఈ కవి సరిగ్గా చేసింది అదే.. తూటా లాంటి మాటలతో వాళ్ళల్లో ధైర్యం నింపడానికి తన కలాన్ని కదిలించాడు
నువ్వు రాల్చే ప్రతి కన్నీటిబొట్టు
గట్టిదనాన్ని సంతరించుకొని
నిన్ను చెరబట్టిన వారి బతుకు మీద
మరఫిరంగిలా మారాలి
మందుపాతరై పేలాలే
…………………………..
ఏడ్చేదెందుకు చెల్లే కన్నీళ్లు వృధా
ఏడిపించే శివంగివై దూకాలే (చెల్లే ఏడుపొద్దు !)
అంటూ
వారికి తిరగబడే ధైర్యాన్ని నూరి పోశాడు.
ఒకానొక సందర్భంలో RGV గారు ఇలా అంటారు
“క్రైమ్ అంతరించి పోలేదు ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంది అంతే !” అని. అలాగే అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకున్న ఈ సమయంలో కూడా దోపిడి అంతరించిపో లేదు కొత్త కొత్త రూపాలను సంతరించుకుంది.
అది  దాదాపు అన్ని రంగాల్లోనూ,అన్ని ప్రదేశాల్లోనూవుంది. సినిమా రంగం కూడా దానికి అతీతమైనదేమీ కాదు . తన లోపల ఉన్న గొప్ప కళను ప్రపంచానికి చూపిద్దామని అవకాశాల కోసం వెళ్లిన స్త్రీల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. విభిన్న రంగాల్లో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల్లో నుంచి పుట్టుకొచ్చిందే
“మీటూ”ఉద్యమం
“మా మేకప్ కలల మాటున ఉరి తీయబడ్డ
మా పడుచు స్వప్నాలెవరికీ తట్టవు
…………
బంగారు నూతల పంజరాల్లో
ఖరీదైన రాచబంధనాల
రాకాసి కౌగిళ్ళు మావి
మా గ్లిసరిన్ కన్నీళ్ళ మాటున
మా  సొంత కన్నీళ్లు ఎవరికి కనిపించవు
………….
ప్లాస్టిక్ నవ్వులు చెదిరిపోయాక
మా పెదాల మీద పూచేవన్నీ
విషాదాల ఛాయాపువ్వులే” (మీటూ  మీటూ  మీటూ)
అంటూ సినీ పరిశ్రమలో స్త్రీలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను ఎంతోహృద్యంగా ఆవిష్కరించారు.
అంతేకాకుండా వారు ఎదుర్కొంటున్న దయనీయమైన పరిస్ధితులకు వ్యతిరేకంగా జరుగుతున్న “మీటూ” ఉద్యమంతో గొంతు కలుపుతాడు కవి.
కొన్నిసార్లు రససిద్ధి కలగాలంటే కవిత మొత్తం చదవాల్సి వస్తుంది కొన్నిసార్లు రెండు లైన్లు చదివినా రససిద్ధి కలుగుతుంది కానీ ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే కవిత మొత్తం చదివినా , ఆ కవితలోని రెండు వాక్యాలు చదివినా రససిద్ధి కలుగుతుంది. ఈ పుస్తకంలో మీరు ఏ కవిత చదివినా లేదంటే కవితలోని కొన్నివాక్యాలు చదివినా అందులోని మహత్తు మీకు అర్థమవుతుంది.మీరు చదివిన రెండు వాక్యాలు ఈ పుస్తకాన్ని మొత్తం చదివించేలా చేస్తుంది అదే విశేషం. అలా రాయగలగడమే  ప్రతిభ. ఉదాహరణకు వాళ్ళ అమ్మ గురించి కవి రాసిన ఈ కవితావాక్యాలు చూడండి
“సముద్రమంత దుఃఖాన్ని కూడా
కొంగులోనే ముడేసుకుని
కన్నీరంటకుండా కాళ్లు దాటించిన
దిగులేరు మా అమ్మ” (పిచ్చి తల్లి) ఇది చదువుతుంటే వాళ్ల కుటుంబ కష్టాలు ఆ తల్లి యొక్క ఆత్మవిశ్వాసం, మనోనిబ్బరం మనకు అర్థమవుతుంది.
ఈ కవికి రంగుతో,రూపుతో ,కులంతో , మతంతో ఎలాంటి సంబంధంలేని  సత్యమైన, స్వచ్ఛమైన , ఇతరులకు హాని కలిగించని, పరోపకారం చేసే మనుషులంటే మహా ఇష్టం ;
“దిగులు పొట్లమై ముడుచుకుని
కన్నీరు కాలువలు కడుతున్నప్పుడు
నీకు నేను ఉన్నాను కదా “అని
అలసిన ముఖాన్ని  రెండు చేతుల్లోకి తీసుకుని
మెటికలు విరుస్తూ ఆత్మీయంగా ముద్దులాడే
అమ్మలాంటి రెండు పెదాలున్న ముఖం కావాలి”(నాకో ముఖం కావాలి)
అంటూ అలాంటి ముఖాలున్న మనుషులను ప్రేమిస్తానంటాడు,ఆరాధిస్తానంటాడు, తలపైన పెట్టుకుంటానంటాడు. అలాంటి మనిషికోసం పరితపిస్తానంటాడు,అలాంటి స్వచ్ఛమైన మనుషులు ఉన్నప్పుడే సమాజం పురోభివృద్ధి చెందుతుందంటాడు.
2020 వ సంవత్సరాన్ని మానవజాతి ఎప్పుడు మరిచిపోదు.అది కరోనా నామ సంవత్సరం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలైన సంవత్సరం, ప్రపంచం లోని మనుషులంతా గృహనిర్బంధంలో  ఉన్నసంవత్సరం, కొన్ని లక్షల మందిని పొట్టనబెట్టుకున్న సంవత్సరం, అంతేకాదండోయ్ !  తన తెలివి తేటలతో విర్రవీగుతున్న మనిషి అహంకారాన్ని అణచిన సంవత్సరం కూడా.
ఏది ఏమైనప్పటికీ ఆ సంవత్సరంలో కరోనా వీర విహారానికి ఎక్కువగా నష్టపోయింది మాత్రం సామాన్య ప్రజానీకం. వలస కూలీల పరిస్థితి ఐతే మరీ దారుణం ఇంటికి పోలేక ఉన్న చోటే ఉండలేక నానా అవస్థలు పడ్డారు. కొన్ని వందల కిలోమీటర్లు సైతం నడుచుకుంటూ వెళ్లారు.మధ్య మధ్యలో కొంతమంది పెద్దలు సహృదయంతో అందించిన సహకారం ద్వారా రోడ్లపైనే తినుకుంటూ కాలినడకన పయనమయ్యారు .అది అత్యంత దయనీయమైన పరిస్థితి.
ఇలాంటి సమయంలో
“మనం మన ఊరి పొలిమేరల్లో
రోడ్డుకిరువైపులా
చలివేంద్రాలై నిలబడదాం
అన్నంపొట్లాలమై ఎదురెళ్దాం
నడక పాదాల మీద పూలు చల్లకపోయినా
ఆకలి మంటలు ఆర్పేసే
మెతుకుపూలవానై కురుద్దాం”(మెతుకుపూలవాన)అంటూ
వలస జీవులకు చేయూతనిద్దామని కవి తనచుట్టూవున్న సమాజాన్ని తట్టి లేపాడు.
“క్రిమి సోకిన దేశం గజగజా వణుకుతూ ఉంటే
వీళ్ళ మాయలూ మంత్రాలూ
మాయ నూనెలు , మంత్ర జలాలూ
ఉబుసుపోని మాయోపదేశాలు మూటగట్టి
ఏ కలుగుల్లో నిద్రపోతున్నారు వీళ్లంతా
ఏమైపోయారు వీళ్లంతా?!(ఏమైపోయారు?)
అంటూ
ప్రజల్లోమూఢనమ్మకాలను పెంచి సొమ్ముకాజేసేవారిని దూనుమాడతాడు. అభివృద్ధి చెందాలంటే మూఢనమ్మకాలకు కాదు  సైన్సుకు పెద్ద పీట వేయాలని చెబుతాడు.
ఎప్పటికైనా విజయం సాధించేవి, అభివృద్ధికి కారకమయ్యేటివి హేతువాద దృక్పథం,ప్రశ్నించే స్వభావం, శాస్త్రీయదృష్టియని కవి గట్టిగా నమ్ముతాడు.
ఇలా కరోనా కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఆ కాలాన్ని అంతటిని కళ్లకు కట్టేలా కవితలుగా మలిచిన తీరు మహా అద్భుతంగా అనిపిస్తుంది.
తన కవిత్వం అంతా మనిషి- సమాజం  చుట్టూరా తిరుగుతుంది . అది  అలాంటి ఇలాంటి మనిషి కోసం కాదు స్వచ్ఛమైన మనిషిలాంటి మనిషికోసం. అలాంటి మనిషిఅలికిడి  కోసం నిరంతరం అన్వేషిస్తానంటాడు.
మరోసారి చెప్పాలనిపిస్తుంది ఈ కవితా సంపుటిలోని ఏ కవిత చదివిన మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది , ప్రతీ కవితకు సమీక్ష రాయాలనిపిస్తుంది. అనువాద కవితలు కూడా అనువాదంలా అనిపించవు స్వచ్ఛమైన తెలుగు కవితలేమో అని అనిపిస్తుంది .దాన్లోని ఆత్మను ఏమాత్రం పోనీయకుండా అలా అనువదించడం కవికి ఆంగ్ల భాష పైన,ఆంగ్ల కవిత్వం మీద  ఉన్న పట్టును తెలియ చేస్తుంది. ఇంతటి అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టిస్తున్న ఈ కవి ఎప్పటికీ చిరంజీవే.
“If i read a book and it makes my whole body so
cold no fire can worm me.I know that is poetry”
– Emily Dickinson
ఈ పుస్తకంలోని కవితలు చదివితే  మీకు కూడా అలాంటి భావనే కలుగుతుందనేది నా బలమైన నమ్మకం
ఇది అందరూ తప్పకుండా కొని చదవాల్సిన పుస్తకం.

Related Posts